సింబల్ లోడింగ్ జాగ్రత్తగా చేయండి
ఈవీఎం, వీవీ ప్యాట్ల కమిషనింగ్ కీలకం
కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, మే 6 (విజయ క్రాంతి): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో కరీంనగర్ , చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి, పాలిటెక్నిక్ కళాశాలలో మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంల కమిషనింగ్‌ను అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్‌లతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వీవీ ప్యాట్స్‌లలో జాగ్రత్తగా సింబల్ లోడింగ్ చేయాలని సూచించారు.
జనగామలో.. కమిషనింగ్ చేసే ముందు ప్రతీ వీవీ ప్యాట్, ఈవీఎంను క్షుణ్ణంగా పరిశీలించాలని పార్లమెంటు నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ తెలిపారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహిస్తున్న ఈవీఎం, వీవీ ప్యాట్ల కమిషనింగ్ పరిశీలించారు. కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లకు ట్యాగింగ్ చేసేటప్పుడు పోలింగ్ కేంద్రాల నంబర్లను పరిశీలించి సీల్ వేయాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో.. ఈవీఎం కమిషనింగ్ పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలోని రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. కమిషనింగ్ లో ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే టెక్నికల్ సిబ్బందికి, మాస్టర్ ట్రైనర్ల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు.
మంథనిలో.. పార్లమెంట్ ఎన్నికల కోసం ఈవీఎం యంత్రాల కమిషనింగ్ ప్రక్రియను అధికారులు అప్రమత్తంగా పూర్తి చేయాలని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. రామగుండం ఎన్టీపీసీలోని టీటీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం యంత్రాల కమిషనింగ్ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి పరిశీలించారు.
అశ్వారావుపేటలో.. ఈవీఎం కమిషనింగ్ పకడ్బందీగా పూర్తి చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ ఆదేశించారు. అశ్వారావుపేట లో చేపడుతున్న కమిషనింగ్ విధానాన్ని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.
వరంగల్ తూర్పులో.. ఈవీఎంల కమిషనింగ్, మాక్ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఏనుమామలు మార్కెట్ ఆవరణలోని గోదాముల్లో కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో.. సింబల్ లోడింగ్ యూనిట్ల స్టోరేజీ గది వద్ద భద్రత చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటేశ్ దోత్రే తెలిపారు. కలెక్టరేట్‌లోని స్టోరేజీ గదిలో భద్రపరిచిన సింబల్ లోడింగ్ యూనిట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సిర్పూర్ సహాయ ఎన్నికల అధికారి దీపక్ తివారి, ఆసిఫాబాద్ సహాయ ఎన్నికల అధికారి దాసరి వేణుతో కలిసి పరిశీలించారు.




