7 April, 2026 | 1:00 AM

మోదీ గ్యారెంటీకి వారెంటీ లేదు

07-05-2024 12:59 AM

బీజేపీ నేతలది ఉత్త ఆర్భాటం మాత్రమే

20 కోట్ల ఉద్యోగాలని.. రెండుకోట్లు కూడా ఇయ్యలే

బీఆర్‌ఎస్ పోటీలోనే లేదు.. అది చచ్చిన పాము

కాంగ్రెస్ గ్యారెంటీలపై కేటీఆర్ అబద్ధాలు

అంబర్‌పేట, ఉప్పల్, కంటోన్మెంట్ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (విజయక్రాంతి)/ఉప్పల్: బీజేపీ నేతలు మోదీ గ్యారెంటీల పేరుతో ఆర్బాటం చేస్తున్నారు కానీ.. మోదీ గ్యారెంటీలకు వారెంటీయే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ.. కనీసం రెండు కోట్ల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అంబర్‌పేట, ఉప్పల్, కంటోన్మెంట్‌లో కార్నర్ మీటింగుల్లో సీఎం మాట్లాడారు. ‘ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలుంటే అత్యధికంగా ఆకలి ఉన్న దేశాలు లెక్కపెడితే భారత్ 111వ స్థానంలో ఉన్నది. భారత్ ఆకలి కేకలు, ఆత్మహత్యలు, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నది’ అని సీఎం దుయ్యబట్టారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తానన్న మోదీ.. పెట్టుబడులను మూడింతలు చేసి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. తెలంగాణకు మోదీ ఇచ్చింది, కిషన్‌రెడ్డి తెచ్చింది గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. 

బీఆర్‌ఎస్ పోటీలోనే లేదు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అసలు పోటీలోనే లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుకావటం లేదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పథకాలు అమలవుతున్నాయో లేదో తెలుసుకోవాలంటే కేటీఆర్ చీర కట్టుకుని ఎర్రగా బుర్రగా తయారై గౌలిగూడ బస్టాండ్‌కు వచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కాలని.. ఆయనను సిరిసిల్ల, చింతమడక, సిద్దిపేటలో ఉచితంగా దించకుంటే పథకాలు అమలుకావటం లేదని ఒప్పుకుంటానని సవాల్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల విలువైన వైద్యం అందిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ చచ్చిన పాము అని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్.. ఈటల ఒక్కటే

మాజీ సీఎం కేసీఆర్, మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ది పొద్దటి పూట బంధం, రాత్రిపూట ఒప్పందమని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీలోకి వెళ్లి రెండేండ్లయినా ఉప్పల్ ఫ్లుఓవర్ గురించి ప్రధానిని, నితిన్ గడ్కరీని ఏనాడైనా అడిగినవా అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ కాళేశ్వరంలో దోచుకుంటే ఆర్థిక మంత్రిగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది ఎవరు? కొవిడ్ సమయంలో పేదలకు మాస్క్‌లు కొనాలంటే.. మెడిసిన్, ఇంజెక్షన్ ఇవ్వాలంటే, వాటిని కూడా సీఎస్‌ఆర్ ఫండ్స్‌లో కంపెనీలను బెదిరించి వందల కోట్లు సంతోష్‌రావ్ కొల్లగొడుతుంటే వైద్యారోగ్యశాఖ మంత్రిగా సంతకాలు పెట్టింది ఈటల రాజేందర్ కాదా? కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల దోపిడీకి పాల్పడిందంటే.. ఆ దొంగలకు సద్దులు మోసింది ఈటల రాజేందర్ కాదా? ధరణి ముసుగులో ఔటర్ రిండ్‌రోడ్డు చుట్టూ వేల ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకుంటే వారి గడీల దగ్గర కాపలా కాచింది రాజేందర్ కాదా?’ అని ప్రశ్నించారు. గద్దరన్నకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ప్రగతిభవన్ ఎదుట ఎర్రటి ఎండలో ౪ గంటలు కూర్చోబెడితే.. ఒక్కరోజన్నా కేసీఆర్‌ను ఇదేమిటని అడిగావా? అని నిలదీశారు.  

కంటోన్మెంట్‌ను విలీనం చేస్తాం 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల సమస్యలకు మోక్షం లభించాలన్నా.. ఈ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్నా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్‌ను గెలిపించా లని రేవంత్ కోరారు. పికెట్‌లో సోమవారం కార్నర్ మీటింగ్‌లో మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీతతో కలిసి పాల్గొన్నారు. పదేళ్లుగా కంటోన్మెంట్ ప్రజలను బీఆర్‌ఎస్, బీజేపీలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల ఓటరు కార్డును రద్దు చేసిన చరిత్ర ఆ పార్టీలదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ రద్దయిన రూ. వెయ్యి నోటు లాంటిదని ఎద్దేవా చేశారు.  

* కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిదంటే.. ఆ దొంగలకు సద్దులు మోసింది ఈటల రాజేందర్ కాదా? ధరణి ముసుగులో ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ వేల ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకుంటే వారి గడీల దగ్గర కాపలా కాసింది రాజేందర్ కాదా? గద్దరన్నకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ప్రగతిభవన్ ఎదుట ఎర్రటి ఎండలో  కూర్చోబెడితే.. ఒక్కరోజన్నా కేసీఆర్‌ను ఇదేమిటని అడిగావా? 

 సీఎం రేవంత్‌రెడ్డి