04-07-2025 08:52:58 AM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై కలెక్టర్ ప్రావీణ్య(Collector Pravinya) ప్రకటన చేశారు. ఈ ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడ్డారని కలెక్టర్ వెల్లడించారు. సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో 38 మంది మరణించారని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 31 మంది మృతదేహాలను గుర్తించామని పేర్కొన్నారు. ఇంకా ఏడుగురి మృతదేహాలను గుర్తించలేదని తెలిపారు. ఆస్పత్రి నుంచి ఇప్పటివరకు 12 మంది డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభించలేదని సూచించారు.
సిగాచీ ఇండస్ట్రీస్‌లో పేలుడు(Sigachi Pharma Factory Blast) ఘటనపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. బుధవారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి, శిథిలాల నుంచి మరో రెండు మృతదేహాలను వెలికితీశారు, దీనితో అధికారిక మరణాల సంఖ్య 38కి చేరుకుంది. మరో 10 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదు. ఇంతలో, మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు రూ.1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని కంపెనీ ప్రకటించింది. ఆరుగురి రక్త నమూనాలను డీఎన్‌ఏ విశ్లేషణ కోసం పంపినట్లు కలెక్టర్ పి. ప్రవీణ్య ధృవీకరించారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించినట్లు ఆమె తెలిపారు.