13-01-2026 11:19:40 PM
రేగొండ,(విజయక్రాంతి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ఈ మేరకు ఆయన మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ సంకీర్త్ తో కలిసి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, రవాణా, టీజీఎండీసీ తదితర శాఖల అధికారులతో ఇసుక అక్రమ రవాణాపై చేపట్టాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గతంలో మాన్యువల్ కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక అందించామని, ఇకపై ఆ విధానాన్ని పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇకపై జిల్లాలో ఇసుక అవసరమైన లబ్ధిదారులు తప్పనిసరిగా “మన ఇసుక వాహనం” యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా ఇసుక పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. త్వరలోనే తహసీల్దార్లు, టీజీఎండీసీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై విశ్లేషణ చేస్తామని అన్నారు. జిల్లాలోని ఇసుక రీచ్‌లను గుర్తించేందుకు ఇరిగేషన్, టీజీఎండీసీ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
ట్రాన్స్‌పోర్ట్ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టి ఓవర్‌లోడింగ్‌లను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలు, అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలించినా, అక్రమ డంపులు ఏర్పాటు చేసినా చర్యలు తప్పవని తెలిపారు. పోలీసులతో కలిసి నిరంతరం తనిఖీలు చేపడతామని, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. ఇసుక రీచ్‌లు, వాగుల నుంచి ఇసుక తరలించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తామని, అక్రమ ఇసుక రవాణా చేస్తే వాహనంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.