20-11-2025 12:39:20 AM
-లైసెన్స్ రెన్యువల్ చేయొద్దు
-ఆడిట్ తప్పుల తడక
-నిజామాబాద్ 3వ కల్లు డిపోపై పిర్యాదుల వెల్లువ
-అక్రమాలపై కలెక్టర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు పిర్యాదు
-గత మూడేళ్లుగా ఆడిట్ చూపడం లేదు
-బినామీలతో రూ.కోట్ల దుర్వినియోగం
-నాన్ లోకల్ వ్యక్తి మాకు అధ్యక్షుడా?
-సభ్యుల తీవ్ర ఆరోపణ
-‘విజయక్రాంతి’ వరుస కథనాలకు స్పందన
నిజామాబాద్ నవంబర్ 19 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని మూడవ నెంబర్ కల్లు సామూహిక సహకార సంఘం (టి.సి.ఎస్.నెం.1034/2016) డిపోలో యాజమాన్యం సాగిస్తున్న అవినీతి, అక్రమాలు, దోపిడీపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. డిపో యాజమాన్యం యొక్క అక్రమ వ్యవహారాలపై, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనపై ’విజయ క్రాంతి’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు డిపో సభ్యుల నుంచి తీవ్ర స్పందన లభించింది.
తమ హక్కులను కాపాడుకునేందుకు, జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు సభ్యులు ఏకతాటిపైకి వచ్చారు. ఈ క్రమంలో, సోమవారం (నవంబర్ 17, 2025) డిపో సభ్యులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ విన య్ కృష్ణారెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్)లను వారి కార్యాలయాల్లో కలిసి, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత మూడేళ్లుగా డిపోలో ఎలాంటి ఆడిట్ తనిఖీలు జరగడం లేదని, ఇదే అదనుగా యాజమాన్యం అడ్డూఅదుపు లేకుండా అవకతవకలకు పాల్పడుతోందని వారు తమ ఫిర్యాదు పత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిర్యాదులోని ముఖ్యాంశాలు ఇలా..
సభ్యులు అందించిన ఫిర్యాదు పత్రం ప్రకారం, ఈ సంఘంలో మొత్తం 55 మంది సభ్యులు ఉండగా, యాజమాన్యం వారిని దారుణంగా మోసగిస్తున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా కల్లు డిపోకు చెందిన ఆడిట్ లెక్కలు బయట పెట్టడం లేదు. స్థానికేతరుడికి అధ్యక్ష పదవి ఇచ్చినట్టు తెలుస్తున్నం దున, ఆ ఎన్నిక ప్రక్రియను ప్రస్తుతం నిలిపివేయండి. కల్లు డిపో యాజమాన్యం ప్రక్షాళన, లెక్కలు తేలే వరకు, డిపో లైసెన్స్ రెన్యువల్ చేయవద్దు. అప్పటి వరకు లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియను నిలిపి వేయండి.
బినామీ అజమాయిషీ‘ దందాలో భాగంగా యాజమాన్యం కావాలనే ‘బినామీ అజమాయిషీ ప్రొడక్షన్ కటింగ్‘ పేరుతో నకిలీ సభ్యులను సృష్టించి, వారి పేర్ల మీద రూ.కోట్ల డబ్బులు కాజేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. వాస్తవ సభ్యులకు దక్కాల్సిన ఫలాలను బినామీల పేరిట పక్కదారి పట్టిస్తున్నారని వారు పేర్కొన్నారు .ఈ అక్రమాలన్నిటికీ కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలు ఉన్నాయని, అందుకే యాజమాన్యం ఇంత ధైర్యంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని సభ్యులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం చేస్తున్న ఈ అక్రమాలను, దోపిడీని ప్రశ్నించిన సభ్యులపై బెదిరింపులకు దిగుతున్నా రని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు వాపోయారు.
సమగ్ర ఆడిట్ జరపాలి..
గత మూడు సంవత్సరాలుగా డిపోలో జరుగుతున్న ఈ అక్రమాలను వెలికితీయాలంటే, తక్షణమే ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర ఆడిట్ విచారణ జరిపించాలని సభ్యులు డిమాండ్ చేశారు. బినామీల పేరుతో డబ్బులు డ్రా చేయడం, బినామీ పేర్లతో నిధులు మళ్లించడం వంటి తీవ్రమైన ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేసి, బాధ్యులైన యాజమాన్యంపై, వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ మరియు ఎక్సైజ్ ఈఎస్ లను కోరారు.
కదిలిన కలెక్టర్..
సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమగ్ర విచారణకు జిల్లా కో ఆపరేటివ్ అధికారిని అదేశించారు. సభ్యుల పిర్యాదు స్వీకరించిన, ఎక్సైజ్ శాఖ సైతం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. వరుస కథనాలు, ఇప్పుడు సభ్యుల నుంచే నేరుగా అందిన ఫిర్యాదులతో ఈ మూడవ నెంబర్ డిపో అక్రమాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. 55 మంది సభ్యుల భవిష్యత్తు, వారి జీవనోపాధి, వేలాది గౌడ సామాజికవర్గ కుటుంబాల మనుగడ ఈ విచారణపైనే ఆధారపడి ఉంది. మరి జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుందో వేచి చూడాలి.