20-11-2025 12:35:58 AM
-పల్లెల్లో జోరుగా బెల్ట్ దందా
-ఇండ్లు, కిరాణా షాపులే మద్యం అమ్మకాలకు కేంద్రాలు
-మద్యానికి బానిసై రోడ్డున పడుతున్న కుటుంబాలు
-చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు
అయిజ, నవంబర్ 19: అయిజ మున్సిపాలిటీ కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో జోరుగా బెల్ట్ దందా కొనసాగుతుంది.గ్రామాల్లో పగలు,రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయాలు జరుపుతుండడంతో యువకులు,ప్రజలు మద్యానికి బానిసై కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు.కిరాణా షాపులు,ఇండ్లలో బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు.కొంతమంది మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ఈ బెల్ట్ దందాను ప్రోత్సహిస్తున్నట్టు పలువురు చర్చించుకుంటున్నారు.
ప్రతి బెల్ట్ షాపుల నిర్వాహకులు బ్రాండ్ ను బట్టి క్వాటర్ పై అదనంగా రూ.30 నుంచి రూ.50 రూపాయల వరకు వసూలు చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. దీంతో చేసిన కష్టం మొత్తం మద్యం తాగడానికే ఖర్చు చేస్తున్నారు.దీంతో భార్యాభర్తలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు కారణం అవుతున్నాయి.ఎనీ టైం మద్యం అందుబాటులో ఉండడంతో తాగి వాహనాలు నడపడంతో పలు యాక్సిడెంట్లకు గురై కుటుంబ పెద్దను కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ
బెల్ట్ షాపులను అరికట్టాల్సిన సంబంధిత ఎక్సైజ్‌శాఖ అధికారులు మామూళ్ల మత్తుకు అలవాటు పడినట్లు పలువురు చర్చించుకున్నారు. ప్రతి నెలనెల బెల్ట్‌షాపుల నిర్వాహ కుల నుంచి ముడుపులు అందుతున్నట్లు తెలిసింది. అందుచేత సిండికేట్ వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసనల్లోనే ఈ బెల్టు దందా కొనసాగుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవలే అయిజ పట్టణ కేం ద్రానికి చెందిన మహబూబ్ బాషా మృతి చెందాడు.
ఈ మృతికి ప్రధాన కారణం మద్యం మత్తు అని తెలిసింది.సోమవారం అర్థ రాత్రి సమయం వరకు మద్యం సేవించి ఇంటికి వెళుతున్న క్రమంలో మురుగు కాలవలో పడి అక్కడేకక్కడే మృతి చెందారని పట్టణవాసులు చర్చించుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లోని బెల్టు షాపుల దందాను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుతున్నారు.