03-08-2025 01:35:05 AM
తనిఖీ సమయంలో పలువురు డాక్టర్లు, సిబ్బంది విధులకు గైర్హాజరు.
సమయపాలన పాటించని సిబ్బంది పై ఆగ్రహం
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని శనివారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ పి రిజిస్టర్, డాక్టర్లు,సిబ్బంది హాజరు రిజిస్టర్,బయో మెట్రిక్ రిజిస్టర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. గైర్హాజరైన, ఆలస్యంగా విధులకు వచ్చిన డాక్టర్లు,సిబ్బంది పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా విభాగాల వారిగా ఇలాంటి వారి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ను ఆదేశించారు. విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఆసుపత్రిలోని జనరల్ వార్డ్, జనరల్ మెడిసిన్ వార్డ్, సర్జరీ వార్డ్ ,ఎమర్జెన్సీ ,సైక్రాటిక్ వార్డ్,తదితర వార్డులను జిల్లా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అత్యవసర చికిత్స విభాగంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే బ్లడ్ బ్యాంకును సందర్శించి బ్లడ్ బ్యాంకులో ఎన్ని యూనిట్ల రక్త నిలువలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే దవాఖానకు వచ్చిన పలువురిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ప్రభుత్వ ప్రధానాస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్, ఆర్ ఎం ఓ విజయకుమార్, డాక్టర్లు విజయానంద్ ,లక్ష్మణ్ ,తదిరులు ఉన్నారు.