తాజా, మాజీల మధ్య మాటల యుద్ధం!
- ఇరువురి మధ్య ముదురుతున్న వివాదం
- పేద ప్రజలకి నా ఆస్తులు పంచుతా: మాజీ ఎమ్మెల్యే రేగా
- చేతకాని మాటలు మాట్లాడితే సహించేది లేదు: ఎమ్మెల్యే పాయం
- అసలు పినపాకలో ఏం జరుగుతుంది..?
- ఆ ఇద్దరి మాటలతో పినపాక గడ్డపై వేడెక్కిన రాజకీయం..
మణుగూరు, ఆగష్టు 26 (విజయక్రాంతి): ప్రస్తుత పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం వివాదాస్పదంగా మారుతుండడంతో పినపాక నియోజకవర్గం లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పై కేసు నమోదు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఉందని రేగా కాంతారావు ఆరోపించారు.
ఈ కేసు విషయంలో హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన రేగ కాంతారావు హైకోర్టు ఈ కేసు ను కొట్టేసింది. కొన్ని రోజుల తర్వాత ఉత్కంఠంగా వీడిన రేగా కాంతారావు కేసు, తర్వాత పినపాక నియోజకవర్గం లోకి ఆయన అడుగుపెట్టడంతో కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మణుగూరు చేరుకున్న రేగా కాంతారావు, కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. మహిళల అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైంది కాదన్నారు.
మంగళవారం ఆయన అంబేద్కర్ సెంటర్లో తన ఆస్తులను పేద ప్రజలకు పంచడానికి సిద్ధమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు సవాల్ విసిరారు. రేగా కాంతారావు మాటలకు ప్రస్తుతం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాటకు మాట సమాధానం ఇచ్చారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం లోనే అక్రమాలు జరిగాయని, గుండాలను, కబ్జా దారులను, మాఫియాగాలను పక్కన పెట్టుకొని పినపాక నియోజకవర్గంలో అందిన కాడికి దోచుకున్నారన్నారు.
మహిళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే తాజా, మాజీల మధ్య మాటల యుద్ధం పై ఎప్పుడు ఏం జరుగుతుందో అని పినపాక నియోజకవర్గం ప్రజలు భయాందోళన గురవుతున్నారు. సవాలు, ప్రతి సవాలు విసురుతూ, వీరిద్దరూ మాటలు మరోసారి తెరపైకి వచ్చారు.
ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అంటూ ఒకరిపై ఒకరు మాటలతో యుద్ధానికి తెర తీశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్,బిఆర్‌ఎస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ పడనుంది. కానీ ఈసారి పినపాక నియోజకవర్గం లో కొత్త వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా రానున్నారని సరికొత్త వ్యాఖ్యలు బహిర్గంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు వీరిద్దరి పాలన చూసినవారు కావడంతో, ఈసారి తాజా, మాజీ లకు ఓటు వేసి గెలిపిస్తారా లేదా మూడో వ్యక్తికి అవకాశం ఇస్తారు వేచి చూడాలి.
రాజకీయంలో ఇరువురు మధ్య పోటీలు సర్వసాధారణంగా ఉంటాయి. కానీ ఒకరి మీద ఒకరు మాటల తో సవాల్ విసిరుకుంటూ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. బిఆర్‌ఎస్ కార్యాలయం కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ కార్యాలయం మాదే అంటూ,,, కాంగ్రెస్ వర్గీయులు బిఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేసి, స్వాధీనం చేసుకున్నారు. ఆనాటి నుండి నేటి వరకు బిఅర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు రూపంలో ముదిరిపోతున్నాయి.
ఇటీవల పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పై యువతి హైదరాబాదులో పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ, వాస్తవాలు తెలియకుండా మాట్లాడారంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర అని రేగ కాంతారావు హాట్ కామెంట్స్ చేశారు. దీంతో మళ్లీ తాజా, మాజీల మధ్య మాటలు యుద్ధం మొదలైంది ‘విజయ క్రాంతి‘ అందిస్తున్న ప్రత్యేక కథనం.






