27 August, 2026 | 2:25 AM

నేడు ఉద్యోగుల ధర్నా

27-08-2026 12:00 AM
  1. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్న ఉద్యోగుల జేఏసీ
  2. విజయవంతం చేయాలని సంఘ నేతల వినతి
  3. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ధర్నా కార్యక్రమాలను చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మహా ధర్నాను చేపట్టనున్నట్లు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు.

ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. 2వ వేతన సవరణ సంఘం (రెండో పీఆర్సీ) నివేదికను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులకు పెండిండ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సుమారు రూ.10వేల కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరారు. న్యూఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను ఉద్యోగులకు పూర్తి స్థాయిలో, సమర్థవంతంగా అమలు చేయలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మికులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.