calender_icon.png 4 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సమ్మిట్‌కు రండి

04-12-2025 01:19:34 AM

  1. తెలంగాణ మోడల్‌కు సహకరించండి 
  2. ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి 
  3. అన్నివిధాలుగా సహకరిస్తామన్న మోదీ
  4. గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని రాహుల్, ప్రియాంకతో పాటు కేంద్ర మంత్రులకు ఆహ్వానం 
  5. నార్త్ ఇండియాలో నన్ను పాపులర్ చేస్తున్నారు: సీఎం

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): భారత్ ప్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం కాం గ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీని కలిసి గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు.

గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వానాన్ని ప్రధాని మోదీని సీఎం అందజేశారు. వికసిత్ భారత్ -2047 జాతీయ లక్ష్యంతో ముడిపడి, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే దార్శనికతతో తెలంగాణ ముందుకు సాగుతోం దని ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి వివరించా రు. ఈ సందర్భంగా తెంగాణకు చెందిన ప్రాజెక్టులు, అభివృద్ది పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నీతి ఆయోగ్ నుంచి వచ్చిన ఇన్‌పుట్‌లు, అన్ని రంగాల్లోని నిపుణులతోనే తెలంగాణ రైజింగ్-2027 విజన్ డాక్యుమెంట్‌ను తయారు చేశామని ప్రధాని కి సీఎం వివరించారు. గత రెండేళ్లుగా వివిధ రంగాల వారిగా వృద్ధి లక్ష్యాలు, భవిష్యత్ వ్యూహాలు విజన్ డాక్యుమెంట్‌లో ఉన్నాయని, గ్లోబల్ సమ్మిట్‌లో అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు సీఎం తెలిపారు.  హైదరాబాద్- బెంగళూరు- చెన్నైలను కలుపుతూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇవ్వాలని కోరారు.

హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓఆర్‌ఆర్‌ను ట్రిపుల్ ఆర్‌కు అనుసంధానించే రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్‌కు అన్ని రకాలుగా మద్దతి చ్చారని ఈ సందర్భంగా మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

ప్రధాని మోదీ దీనికి స్పందిస్తూ, మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పు డు గుజరాత్ అభివృద్ధ్దికి సహకరించారని చెప్పారు. మన్మోహన్ గుజరాత్ మోడల్‌కు సహకరించినట్లే.. మీరు తెలంగాణకు సహకరించాలని, కేంద్రం సహకారంతో తెలంగాణ మోడల్ సృష్టిస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు అన్నిరకాలుగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 

ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రి యాంక గాంధీ, కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వీనీ వైష్ణవ్, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులను కలిసి గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని కూడా సీఎం బృందం కలిసి, తెలంగాణ మోడల్ కార్యక్రమాలను వివరించారు. సీఎం వెంట ఢిల్లీలోని ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, కుందూరు రఘువీర్‌రెడ్డి, సురేష్‌షెట్కార్, చామల కిరణ్‌కుమా ర్‌రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. 

నార్త్ ఇండియాలో నన్ను పాపులర్ చేస్తున్నారు

  1. కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజంలాంటిదేనని చెప్పే ప్రయత్నం చేశాను 
  2. ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు 
  3. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్(విజయక్రాంతి): డీసీసీ అధ్యక్షుల అంతర్గత సమావేశంలో తాను మాట్లాడిన అంశాలను ఎడిట్ చేసి విపక్షాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ సమాజం లాంటిదే అని చెప్పేందుకు తాను ప్రయత్నం చేశానని, దాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్‌రెడ్డిని ఢిల్లీలో మీడియా గుర్తు చేయగా.. ఉత్తర భారతదేశంలో తనను పాపులర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని అక్కడి మీడియా ప్రతినిధులకు తెలిపారు. బుధవారం ఢిల్లీలో ప్రధా ని మోదీ, కాంగ్రెస్ నేతలు, కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాబోయే మరో పదేళ్ల పాటు తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంద ని, సీఎంగా తానే ఉంటాననని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. పార్టీలో సంస్థాగ తంగా తీసుకు రావాల్సిన మార్పులు, స్థానిక ఎన్నికల వేళ వ్యవహరించాల్సిన తీరుపై డీసీసీల సమావేశంలో తాను మాట్లాడినట్లుగా వివరణ ఇచ్చారు. 

డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా.. పెద్ద పదవిలో ఉన్నారనే విష యాన్ని చెప్పే ప్రయత్నం చేసినట్లు చెప్పా రు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయినా వారి తీరులో మార్పు రాలేదని అన్నారు.