03-12-2025 12:00:00 AM
తట్టేపల్లి గ్రామ నాయకుడు ఎం.ప్రభు కుమార్
వికారాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): తట్టేపల్లి మండల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తట్టేపల్లి గ్రామ నాయకుడు ఎం.ప్రభు కుమార్ అన్నారు. తట్టేపల్లి గ్రామంలో తట్టేపల్లి మండల సాధన సమితి జెండాను, కండువాను గ్రామస్థులతో కలిసి మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎం.ప్రభు కుమార్ మాట్లాడుతూ.... గతంలో పెద్ద ఎత్తున తట్టేపల్లి ప్రత్యేక మండల సాధన కోసం ఉద్యమాలు కూడా చేశామన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వివిధ పార్టీల నుంచి తట్టేపల్లి సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు తట్టేపల్లి మండల సాధన సమితి కండువాను కప్పుకొని మండల సాధన కోసం మాతో కలిసి వస్తే గ్రామస్తులతో అందరితో మాట్లాడి మంచి అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించుకొంటామన్నారు.తట్టేపల్లి గ్రామ నాయకులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయా పార్టీల జెండాలను, ఎజెండాలను పక్కన పెట్టి తట్టేపల్లి మండల సాధన కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు.
తట్టేపల్లి మండల సాధన కోసం గతంలో అన్ని పార్టీల నేతలను కలిశామని, అందరు హామీలు, వాగ్దానాలను ఇచ్చి మండల ఏర్పాటును మర్చిపోయారని ఆరోపించారు. తట్టేపల్లి గ్రామ నాయకులు, యువకులు, నామినేషన్ వేసిన అభ్యర్థులు మండల సాధన ప్రయత్నంలో తమ నామినేషన్లను బుధవారం విత్ డ్రా చేసుకొని అందరం కూర్చొని ఒక మంచి అభ్యర్థిని గెలిపించుకొందామన్నారు.
తట్టేపల్లి మండల సాధన సమితి నుంచి 5వ వార్డు నుంచి నామినేషన్ వేసిన సలీమా మొట్ట మొదటిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికయిందని ఎం.ప్రభుకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తట్టేపల్లి మండల సాధన సమితి నాయకులు, యువకులు, వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసిన సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.