బస్సులతో రండి!
అద్దె బస్సులకు ఆర్టీసీ పిలుపు
ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీ
జూన్‌లో విద్యాసంస్థల ప్రారంభంతో మరింత కిటకిట
ప్రస్తుతం గ్రేటర్ సేవలో 2840 బస్సులు..
త్వరలో అందుబాటులోకి 125 మెట్రో డీలక్స్‌లు
అదనంగా 300 అద్దె బస్సులకు ఆర్టీసీ ప్రతిపాదనలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (విజయక్రాంతి): మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీ బస్సులకు రాబడి లేని రద్దీ పెరిగిందనేది అందరికీ తెలిసిందే. ఈ పథకం అమలు కంటే ముందు గ్రేటర్‌లో సరాసరి ప్రయాణీకులు 11 లక్షల మంది ప్రయాణించగా, పథకం ప్రారంభంలో 16 లక్షలకు పైగా ప్రయాణం చేశారు. ఈ పథకానికి ఆదరణ లభించడంతో ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇదిలా ఉండగా, రానున్న జూన్ మాసంలో విద్యా సంస్థలు ప్రారంభమైతే, విద్యార్థులతో ఆర్టీసీ బస్సులు మరింత కిక్కిరిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు చేశారు.
సరాసరి 20 లక్షల మంది ప్రయాణం
గ్రేటర్ హైదరాబాద్ రీజియన్‌లో ప్రస్తుతం 24 డిపోల పరిధిలో 2840 బస్సులు ఉన్నాయి. రోజుకు 31 వేల ట్రిప్పులు నడుస్తున్నాయి. ఈ బస్సు ల్లో సరాసరి 20 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మహాలక్ష్మీ పథకం కంటే ముందు ప్రయాణీకుల సంఖ్య 11 లక్షలు మాత్రమే ప్రయాణం చేశారు. మహిళలకు ఉచితం ప్రయాణం పథకానికి విశేష స్పందన లభిస్తున్న కారణంగా ప్రయాణీకుల సంఖ్య ప్రస్తుతం 20 లక్షల దాకా చేరుకు న్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగియనున్నాయి. రానున్న జూన్ మాసంలో కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమయితే, ఈ సంఖ్య ఇంకాస్తా పెరిగే అవకాశం ఉంది. బస్సుల్లో రద్దీ కూడా మరింత పెరగనుంది. ముఖ్యంగా విద్యాసంస్థల ప్రారంభంతో దాదాపు 3 లక్షల బస్‌పాస్‌లు తీసుకోనున్నారు. జూన్ మాసం నుంచి ప్రయాణీకుల రద్దీని తట్టుకోవడంపై ఆర్టీసీ అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు. దీంతో బస్సులను పెంచుకోవడంపై ఆర్టీసీ ఫోకస్ చేస్తున్నది.
300 అద్దె బస్సులకు ప్రతిపాదనలు..
గ్రేటర్ పరిధిలోని 2840 లలో 321 అద్దె బస్సులు ఉన్నాయి. ఉచిత ప్రయాణానికి సంబంధం లేకుండా 125 మెట్రో డీలక్స్ బస్సులను నడిపిం చేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఈ బస్సులు వచ్చె నెలలోనే రానున్నట్టు సమాచారం. ఇవి కాకుండా, కొత్తగా అద్దె బస్సులను పెంచుకోవాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న 321 అద్దె బస్సులకు అదనంగా మరో 300లకు పైగా అద్దె బస్సులను నడిపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దీంతో గ్రేటర్ వ్యాప్తంగా ఈ బస్సులను సమకూర్చుకోవడానికి సం బంధిత ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తున్నది. ఈ బస్సులు కూడా వచ్చె నెలలోనే నడిచేలాగా చర్యలు చేపడుతున్నారు. దీంతో 125 మెట్రో డీలక్స్ బస్సులతో పాటు ప్రతిపాధించిన 300 లకు పైగా అద్దె బస్సులు అందుబాటులోకి వచ్చినట్టయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం బస్సుల సంఖ్య 3 వేలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉండే వీలుం దని అధికారులు భావిస్తున్నారు.






