15 March, 2026 | 3:24 AM

పారిశుద్ధ్యంపై బల్దియా ప్రత్యేక నజర్

15-03-2026 02:06 AM

ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణపై ప్రత్యేక డ్రైవ్

పహాడీ షరీఫ్‌లో ఈవేస్ట్ సేకరణను పర్యవేక్షించిన కమిషనర్   

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 14 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణతో పాటు, రానున్న రంజాన్ పండుగను దృష్టి లో ఉంచుకుని పారిశుద్ధ్య నిర్వహణను మరింత వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జల్ పల్లి పరిధిలోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ నిర్వహిస్తున్న ఈవేస్ట్ సేకరణ డ్రైవ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, పహాడీ షరీఫ్ ఈద్గాహ్ వద్ద భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నగరంలో పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్నాయ ని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. పహాడీ ఈవేస్ట్ సేకరణ, నిల్వ, నిర్వహణ విధానాలను ఆయన నిశితంగా పరిశీలించారు. ప్రజలు తమ వద్ద ఉన్న పాత ఫోన్లు, కంప్యూటర్లు, బ్యాటరీలు వంటి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా, కేవలం అధికారిక సేకరణ కేంద్రాలకు మాత్ర మే అప్పగించేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

రంజాన్ పండుగ సందర్భంగా పహాడీ షరీఫ్ ఈద్గాహ్ భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఏర్పాట్లలో ఎక్కడా లోపం ఉండకూడదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈద్గాహ్ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే నగర పారిశుద్ధ్యంపై కమిషనర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు.ఇంటింటి చెత్త సేకరణను 100 శాతం సమర్థవంతంగా నిర్వహించాలని, రోడ్ల క్లీనింగ్ ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్లు, సర్కిల్ అధికారులు,పారిశుద్ధ్య విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.