30 June, 2026 | 2:14 AM

కౌన్సెలింగ్‌తోనే బీ-కేటగిరి సీట్లను భర్తీచేయాలి

30-06-2026 01:30 AM

దోపిడీ కళాశాలలపై ఏసీబీ, ఐటీ దాడులు నిర్వహించాలి

ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ధర్నా

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ఇంజనీరింగ్ బీ-కేటగిరి సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, యాజమాన్య కోటా పేరుతో ఫీజులు దోపిడీ చేస్తున్న కళాశాలలపై ఏసీబీ, ఐటీ దాడులు నిర్వహించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

మెరిట్ విద్యార్థులకు న్యాయం దక్కాలన్నారు. సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌన్సిలింగ్ ద్వారా బీకేటగిరి సీట్లను భర్తీ చేయకపోవడంతో మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

ఈ సందర్భంగా కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల దోపిడీ చేస్తున్నాయని, ఇంజనీరింగ్ విద్యను పూర్తిగా వ్యాపారమ యంగా మార్చాయని ఆరోపించారు. యాజమాన్య కోటా సీట్లను బ్లాక్‌లో పెడుతూ మెరిట్ విద్యార్థులకు ఇవ్వకుండా, లక్షలల్లో ఫీజులు కట్టేవారికి వాటిని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. అధికంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న కళాశాలలపై ఏసీబీ, ఐటీ దాడులు నిర్వహించాలన్నారు.

విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రఘురాం నాయక్, గ్యార నరేష్, రెహమాన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏండి అన్వర్, అనిల్, దత్తురెడ్డి, ఆకాష్ నాయక్, శాంతి కుమార్, లెనిన్, హరీష్, నాయకులు అశ్వన్, యశ్వంత్, చట్ల సమ్మయ్య, రాహుల్, లోకేష్, వినోద్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.