12-05-2025 12:53:36 AM
కరీంనగర్. మే 11 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం నాయకులు గాంధీభవన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి పదవులు దక్కించుకునేందుకు ఎవరిస్థాయిలో వారు పైరవీలు ప్రారంభించారు.
ఈసారి ఎలాగైనా అవకాశం కల్పించాలని పార్టీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునేందుకు గాంధీభవన్, మినిస్టర్ క్వార్టర్సకు పరుగులు తీస్తున్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన తమకు ఇప్పుడు తప్పకుండా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కష్టకాలంలో పార్టీలో కొనసాగిన తమకు అవకాశమిస్తే పార్టీని మరింత లోపేతం చేస్తామని ధీమాగా ఉన్నారు.
అధ్యక్షుడిగా ఉన్న మనకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పదవీకాలం పూర్తయింది. కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్రావు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, మెన్నేని రోహిత్ రావు, పత్తి కృష్ణారెడ్డి, వైద్యుల ఆంజన్ కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అశావహుల జాబితాలో ఉన్నారు.
వీరితోపాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా ఈ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్ ను పార్టీ క్రమశిక్షణ సంఘం ఇటీవలే సస్పెండ్ చేసింది. తరచుగా అగ్రనేతలపై విమర్శలు గుప్పిస్తున్నారన్న కారణంతో ఆయనపై వేటు వేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ఈ స్థానం కోసం అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, ఆకారపు భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇటీవలి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో స్వల్ప వ్యత్యాసంతో ఓడిపోయిన నేపథ్యంలో తనకు డీసీసీ ప్రెసిడెంట్, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు.
గత ఎన్నికల సమయంలో తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదని, కనీసం పార్టీ అసెంబ్లీ పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరుకున్నారు. కరీంనర్ పార్టీకి నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తనకు పదవి కావాలని అధిష్టానాన్ని కోరకున్నా బాధ్యతలు అప్పగిస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ అధికారంలో లేని కాలంలో నగర అధ్యక్షునిగా సేవలందించిన పేరు ఆయనకు ఉంది.
ఇదిలా ఉంటే పార్టీ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్రావుకు కరీంనగర్ అసెంబ్లీకి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాను సిద్ధం చేసే బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న క్రమంలో ఈ బాధ్యతలు అప్పగించడంతో ఆయనకు పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతుంది.
ఇటీవల గాంధీ భవన్ వద్ద ఆయన అనుచరులు పార్టీ అగ్రనేతల ఎదుట బలప్రదర్శన కూడా చేశారు. పోటీ తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో పార్టీ పదవులు ఎవరికి దక్కుతాయన్న ఆసక్తి కాంగ్రెస్ పార్టీలో నెలకొంది.