12-05-2025 12:56:33 AM
మహబూబాబాద్, మే 11 (విజయ క్రాంతి): కేసముద్రం మున్సిపల్ కమిషనర్ వెళ్లే దారిని ప్రతిరోజు శుభ్రం చేస్తూ, అంతర్గత వీధులను పట్టించుకోకపోవడం పై గత నెల 28న ‘అద్దంలా.. మేడం వెళ్లే దారి..’ అనే శీర్షికతో ‘విజయ క్రాంతి’ దినపత్రికలో ప్రచూరించిన వార్తా కథనానికి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ అధికారులు స్పందించారు.
వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేకంగా ట్రాక్టర్ తో వీధుల్లో తిరిగి పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు.
వీధుల్లో చెత్తను తొలగించడం పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, చెత్తకుండీలు లేక రోడ్ల పక్కన పడేస్తున్న చెత్తతో దుర్వాసన వెదజల్లుతుండడం వల్ల నడవలేక పోతున్నామని, ఇప్పుడు చెత్త తొలగింపుతో కొంత ఊరట కలిగించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారుల తో పాటు అంతర్గత వీధుల్లో చెత్తకుండీలను ఏర్పాటు చేసి, ప్రతిరోజు చెత్తను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.