26-08-2025 04:49:37 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన తాగునీటి పనులను ఈ డిసెంబర్ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ మున్సిపల్ సమావేశ మందిరంలో నల్గొండ మున్సిపల్ పరిధిలో చేపట్టిన తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు, పారిశుధ్యం తదితర అంశాలపై మున్సిపల్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో అమృత్ పథకం కింద సుమారు 56 కోట్ల 75 లక్షల రూపాయలతో చేపట్టిన తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులు డిసెంబర్ లోగా పూర్తిచేసి ప్రజలకు తాగునీరు అందించాలని ఆదేశించారు. అలాగే తాగునీటి ట్యాంకులకు సోర్స్ నుండి నీరు అందించేందుకుగాను అవసరమయ్యే అదనపు నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
నల్గొండ మున్సిపాలిటీలో 109 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టిన సిసి రోడ్లు, మురికి కాలువల పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులతో చెప్పారు. ఒకవేళ నిధులు సరిపోనట్లయితే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే రాత్రి ,పగలు పనులు నిర్వహించి రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఇకపై ఈ పనులపై ప్రతి మంగళవారం తాను సమీక్షిస్తానని మంత్రి తెలిపారు.చందనపల్లి బయోమైనింగ్ డంపింగ్ యార్డ్ ను త్వరితగతిన శుభ్రం చేయించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ సూపరింటిండెంట్ వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, డిఇ లు కార్తీక్, అశోక్ ,శ్రీధర్ రెడ్డి, ఏఈలు దిలీప్, ప్రవీణ్, అసిం బాబా, ఏసీపీ కృష్ణవేణి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.