calender_icon.png 26 August, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోట కలెక్టరేట్ ఎదుట ఆశాల ధర్నా

26-08-2025 04:29:20 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చిన ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలను వెంటనే ఇవ్వాలని, సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం కలెక్టరేట్(Manukota Collectorate) ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు.

వీరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిక్స్డ్ వేతనం నెలకు 18 వేల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశారన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పూర్తిగా విఫలం చెందిందన్నారు. ఒక వైపు ఆశాలకు అదనపు పని భారం మోపుతూ, మరోవైపు వేతనాలు పెంచే విషయంలో ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారన్నారు.  పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్లకు 62 ఏళ్ల వరకు పని భద్రత కల్పిస్తూ,  రిటైర్మెంట్ తర్వాత లక్షా యాభై వేల గ్రాట్యూటీ ఇస్తూ, నూటా ఎనబై రోజుల పాటు  వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తున్నారన్నారు. మరి మన రాష్ట్రంలో కూడా అదే పని చేస్తున్న ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లకు తాను ఇచ్చిన వాగ్దానం ప్రకారం 18 వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని,  ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఏఎన్సి, పిఎన్సీ టార్గెట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు, జిల్లా  సహాయ కార్యదర్శి కుమ్మరి కుంట నాగన్న, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  రమాదేవి, ఉపేంద్ర, కరుణ, ఆసియా, విజయ, స్వరూప, రజిత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.