25 August, 2026 | 2:38 AM

ప్రజావాణిలోనే ఫిర్యాదుదారుడికి అవమానం

25-08-2026 01:39 AM

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే.. ‘సెటిల్మెంట్’ అంటూ సిటీ ప్లానర్ దురుసు ప్రవర్తన

డీసీ ముందే బాధితుడిని కించపరిచిన వైనం 

స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం

శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రజల సమస్యలు విని పరిష్కరించాల్సిన ప్రజావాణి వేదికలోనే ఓ ఫిర్యాదుదారుడు చేదు అనుభవం పొందాడు. మియాపూర్ సర్కిల్-48లో సోమవారం జరిగిన ప్రజావాణిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుష్మా యాదవ్ ఫిర్యాదుదారుడిపై దురుసుగా మాట్లాడినట్లు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.

డిప్యూటీ కమిషనర్ సమక్షంలోనే జరిగిన ఈ ఘటనతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మదీనాగూడ డివిజన్ పరిధిలోని రామకృష్ణనగర్లో ప్లాట్ నంబర్ 63లో జీ+3కి మాత్రమే అనుమతులు తీసుకుని అదనంగా మూడు అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నారని ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన ఇంటి ముందు జరుగుతున్న ఈ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆయన డీసీకి వివరించేందుకు ప్రయత్నించాడు.

అయితే పక్కనే ఉన్న అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుష్మా యాదవ్ సీటు నుంచి లేచి వచ్చి ఫిర్యాదుదారుడిపై తీవ్రంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.వీళ్లంతా సెటిల్మెంట్ కోసమే వస్తారు సమస్యలు పట్టవు ఇలాంటి భవనాలకు నోటీసులు ఇవ్వడం దండగ అంటూ డీసీ ముందే వ్యాఖ్యలు చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజల గోడు వినాల్సిన అధికారే ఫిర్యాదుదారుడిని కించపరిచేలా మాట్లాడటంపై అక్కడున్నవారు విస్మయం వ్యక్తం చేశారు.

అక్రమ నిర్మాణంపై చర్యలు కోరుతూ వచ్చిన వ్యక్తినే అనుమానించడం, పైగా దురుసుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు తలెత్తాయి.సర్కిల్-48 పరిధిలో అనుమతులకు మించి నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు స్థానికుల్లో వినిపిస్తున్నాయి. జీ+3కి అనుమతి ఉండగా అదనంగా మూడు అంతస్తులు నిర్మించారన్న ఫిర్యాదు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని వారు అంటున్నారు.

అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు మౌనం వహిస్తే నిబంధనలు ఉల్లంఘించేవారికి మరింత ధైర్యం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణి అంటే ప్రజలకు భరోసా కల్పించే వేదికా&లేక ఫిర్యాదుదారులనే ప్రశ్నించే వేదికా అని స్థానికులు నిలదీస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులను పక్కనపెట్టి ‘సెటిల్మెంట్’ వంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ఉన్నతాధికారులే తేల్చాల్సి ఉందని బాధితుడు, స్థానికులు కోరుతున్నారు.