14-07-2025 01:46:16 AM
ప్రొఫెసర్ హరగోపాల్
హనుమకొండ, జూలై 13 (విజయ క్రాంతి): గత పాలకుల విధానాల వల్ల విద్య, వైద్యం లాంటి మౌలిక రంగాలు నాశనమయ్యాయని, ప్రజలు రాజకీయ చైతన్యంతో, రాజకీయ పార్టీల స్వభావంలో మార్పుతేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడి సమగ్రాభివృద్ధి జరుగుతుందని ప్రొఫెసర్ హరగో పాల్ పేర్కొన్నారు.
‘అప్పుల ఊబిలో తెలంగాణ ప్రభుత్వం కారణాలు, పరిష్కారాలు’ అనే అంశంపై హనుమకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ మేధావుల సూచనలను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు.
ఆర్థిక శాస్త్రంలో విశ్లేషణలు, సూచనలు ఉంటాయని, రాజకీయ శాస్త్రంలో, రాజకీయాల్లో పరిష్కారాలుంటాయని అన్నారు. తెలంగాణలో పరిష్కారం చూపాల్సిన రాజకీయాలే సమస్యగా మారిన దుస్థితి నెలకొందని వాపోయారు.
ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ప్రొఫెసర్లు డీ నర్సింహారెడ్డి, ఆర్‌వీ రమణమూర్తి, సదానందం, ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలకర శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.