తెలంగాణ సమగ్రాభివృద్ధికి బీసీల అభ్యున్నతే బలమైన పునాది
నూతన సీఎస్ సంజయ్ జాజుకు సమగ్ర వినతిపత్రం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం
ముషీరాబాద్, జూలై 13(విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీల సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారతకు పెండింగ్ సమస్యలను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఎస్ సంజయ్ జాజును సోమవారం కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర నిర్మాణంలో బీసీల పాత్ర అత్యంత కీలకమని, రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న ఈ వర్గాల అభ్యున్నతి లేకుండా సమ గ్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం బీసీల సంక్షేమంపై ప్రకటిస్తున్న సానుకూల విధానాలు స్వాగతించదగ్గవేనని, అయితే వాటి అమలులో మరింత వేగం అవసరమన్నారు.
స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, బీసీ సంక్షేమ శాఖకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేసి నిధుల విడుదలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలు, సబ్సిడీ పథకాలు, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన సీఎస్ బీసీల సమస్యలను సానుకూలంగా స్వీకరించి సంబంధిత శాఖలతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటారనే పూర్తి విశ్వాసం తమకు ఉందని తెలిపారు.






