ట్రేడ్ డీల్‌పై ఆందోళన
అమెరికా మధ్య చర్చల దశలో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుండగా, దేశ రైతాంగం మనుగడకే ముప్పుతెచ్చిపెట్టే ఈ ఒప్పందాన్ని పక్కనపెట్టాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ్ బచావో మోర్చా ఆధ్వర్యంలో హర్యానా, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల రైతులు ‘కిసాన్ మహాపంచాయత్’ పేరిట ఉద్యమ బాటపట్టడంతో ఈ ట్రేడ్ డీల్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఈ ఒప్పందాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించడానికి పలు కారణాలు ఉన్నట్టు వ్యవసాయరంగ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్, అమెరికా వ్యవసాయ విధానాల మధ్య ఉన్న వ్యత్యాసం వాటిలో ప్రధానమైనది. అమెరికాలో వందలు, వేల ఎకరాల్లో విస్తరించిన వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి. అక్కడ యంత్రాల సాయంతో కార్పొరేట్ స్థాయిలో వ్యవసాయం సాగుతుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటుంది.
ఉత్పాదక వ్యయం తక్కువగా ఉండటంతో వ్యవసాయ ఉత్పత్తులూ అతి తక్కువ ధరకు లభిస్తాయి. కానీ, మన దేశ వ్యవసాయరంగం పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. మన దేశంలో చాలామంది చిన్న, సన్నకారు రైతులే. చిన్నచిన్న కమతాల్లో మన వ్యవసాయం సాగుతుంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ముఖ్యంగా అతిచౌకైన మొక్కజొన్న, సోయాబీన్, పౌల్ట్రీ, పాల ఉత్పత్తులు పెద్దఎత్తున భారత మార్కెట్‌కు వెల్లువెత్తుతాయి.
ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, పెరుగుతున్న సాగు ఖర్చులు, ఎరువుల కొరత, నకిలీ విత్తనాలు వంటి అనేక సమస్యలతో పోరాడుతున్న కర్షకులు చౌకైన అమెరికా ఉత్పత్తులతో పోటీపడటం దాదాపుగా అసాధ్యం. అమెరికా నుంచి వచ్చిపడే పంట ఉత్పత్తుల మూలంగా ఇప్పుడున్న కనీస మద్దతు ధర కూడా రైతులకు దక్కకుండాపోయే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశాభివృద్ధి కోణంలో చూస్తే, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు అవసరమే. కానీ, దేశీయ వ్యవసాయంపై వాటి ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని మరువకూడదు. ఇలాంటి తరుణంలో కోట్లాది మంది రైతుల జీవనాధారానికి, దేశ ఆహార భద్రతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగకుండా ఈ ట్రేడ్ డీల్‌పై కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.






