గ్రామాల్లో సామరస్యం, ధర్మ పరిరక్షణే లక్ష్యం
త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి
సూర్యాపేట రూరల్, జూలై 15 : గ్రామాల్లో ధర్మ పరిరక్షణ, ప్రజల్లో భక్తి భావం, సామరస్య వాతావరణం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలాజీ బ్లాంకెట్ హాల్లో శ్రీరామ హృదయం సమీక్ష సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముని కరుణ, ఆశీర్వాదాలు ప్రతి గ్రామానికి చేరేలా ‘శ్రీరామ హృదయం‘ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో భక్తి, ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతాయని చెప్పారు. వికాస తరంగిణి సేవకులు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు.ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే ఏకోత్తర సహస్ర కలశాభిషేకం (1001 కలశాలతో అభిషేకం) విశిష్టమైన ఆధ్యాత్మిక మహోత్సవమని పేర్కొన్నారు. శాస్త్రోక్తంగా సిద్ధం చేసిన పవిత్ర ద్రవ్యాలతో కలశాభిషేకం నిర్వహించడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని తెలిపారు.
ఈ పవిత్ర కలశాలు గ్రామాలకు చేరుకోవడంతో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, గ్రామాల్లో ఎలాంటి ఉపద్రవాలు లేకుండా అన్ని వర్గాల ప్రజల మధ్య సామరస్యం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మురళీధరచార్యులు, రామానుజచార్యులు, అశోక్ రావు, శ్రీనివాస్ రెడ్డి, భాస్కరరావు, చకీలం వేణుగోపాల్, ఈశ్వర్ రెడ్డి, నిర్మల, విజయకుమార్ గురవయ్య, మల్లికార్జున్, శ్రీధర్, రవీందర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.






