calender_icon.png 12 February, 2026 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైకి ధీమా... లోన టెన్షన్!

12-02-2026 12:00:00 AM

  1. పోలింగ్ సరళి పై అభ్యర్థులు, పార్టీ నాయకుల చర్చలు 

పోటాపోటీగా నగదు పంపిణీ 

పోలింగ్ ముగిసే వరకు ప్రలోభాల పర్వం 

ఓటర్లకు మూడు పార్టీల తరఫున డబ్బులు

మేడ్చల్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైకి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోపల టెన్షన్ పడుతున్నారు. గెలుపొందడానికి విచ్చలవిడిగా  ఖర్చు చేశారు. మూడు రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు కొన్నిచోట్ల స్వతంత్రులు కూడా డబ్బు పంపిణీ చేశారు. ఆర్థికంగా ఉన్నవారు పోటీ చేసినచోట ఒక్క ఓటుకు రూ. 15000 వరకు పంపిణీ చేశారు.

ప్రత్యర్థి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఓటర్లు అభ్యర్థుల అందరి వద్ద డబ్బులు తీసుకున్నారు. ఓటర్లు అందరి వద్ద డబ్బులు తీసుకోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థులందరికీ మీకే ఓటు వేషం అని చెబుతున్నారు. ధన ప్రవాహం వల్ల ఓటరు నాడి అంతు పట్టడం లేదు. రాత్రికి రాత్రి బలాబలాలు తారుమారయ్యాయి. మొన్నటి వరకు ప్రచారంలో వెనుకబడిన వారు ఒక్క రాత్రిలోనే ముందంజలోకి వచ్చారు.

బుధవారం పోలింగ్ ముగిసే వరకు డబ్బులు పంపిణీ చేశారు. ఒక అభ్యర్థి వెండి కాయిన్ లు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇది నకిలీవని ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలతో పోలిస్తే ఓటర్లను ప్రలోభ పెట్టడంలో బిజెపి వెనుకబడింది. మొన్నటి వరకు బిజెపికి కొన్నిచోట్ల అనుకూల పరిస్థితి ఉండగా, పోలింగ్ వరకు సీను మారిపోయింది. మూడు మున్సిపాలిటీలలో మొత్తం పోలింగ్ డబ్బు ఆధారంగానే జరిగింది. 

లెక్కల్లో నిమగ్నమైన అభ్యర్థులు 

పోలింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు లెక్కల్లో నిమగ్నమయ్యారు. ఓటరు జాబితా ముందు పెట్టుకొని ఎవరెవరు ఓటు వేశారు అనేది అంచనా వేశారు. డబ్బులు ఇచ్చిన వారు తమకే వేశారని లెక్క వేసుకుంటున్నారు. ఎన్ని ఓట్లు వస్తాయో ఎంత మెజారిటీ గెలుపొందుతాము అంచనా వేస్తున్నారు.

ప్రశాంతంగా పోలింగ్ 

జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రావల్ కోలు లో చిన్న సంఘటన మినహా అంతట ప్రశాంతంగా జరిగింది. లాల్ గడి మలక్పేటలో ఇటీవల జరిగిన గొడవ నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ఎల్లంపేట, అలియాబాద్ మున్సిపాలిటీల పరిధిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు.