కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- మాజీ మంత్రి హరీష్ రావు
అచ్చంపేట: రాష్ట్రంలో రైతులకు రూ.29,300 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, ఎన్నికల సమయంలో 45 రోజుల్లో రూ.90 వేల కోట్లు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆరోపించారు. సోమవారం అచ్చంపేటలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం 11 విడతల్లో రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు. రైతుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సన్నధాన్యానికి ఎకరాకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూడా రైతులను మోసం చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రతి సీజన్‌లో 1.45 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంటే అందులో సగం మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. రైతు బీమా అమలులోనూ ప్రభుత్వం విఫలమైందని, ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం నిలిచిపోయిందన్నారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా రంగ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో అనేక కళాశాలలు మూతపడటంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పాలమూరు ప్రాజెక్టుల ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం, మన్నెవారిపల్లి రైతుల సమస్యలు, బాధితులకు నష్టపరిహారం వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన హరీష్ రావు, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.






