22 June, 2026 | 6:40 PM

మనందరికి సుప్రీం లీడర్ కేసీఆర్: ఎంపీ వద్దిరాజు

22-06-2026 05:31 PM

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష: ఎంపీ వద్దిరాజు

బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం తథ్యం: ఎంపీ వద్దిరాజు

ఖమ్మం,(విజయక్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మనందరికి సుప్రీం లీడర్ అని,ఆయన నాయకత్వమే రాష్ట్రానికి, ప్రజలకు శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఈ పార్టీలో ముఠాలకు, వర్గాలకు ఏ మాత్రం తావు లేదని, మనమందరం కూడా కేసీఆర్ నాయకత్వాన గులాబీ జెండా కింద పని చేస్తూ ముందుకు సాగుదామన్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని కమ్మ వారి కళ్యాణ మండపంలో సోమవారం సభ్యత్వ నమోదు,ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు జరిగింది.

దీనికి ఎంపీ రవిచంద్ర, పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,ఇతర పార్టీలలో మాదిరిగా బీఆర్ఎస్ లో వర్గాలు అనేవి ఉండవని,మనమంతా కూడా మహానేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుల మార్గ నిర్దేశనంలో పని చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నాయకులు,కార్యకర్తల పనితీరును కేసీఆర్, కేటీఆర్ లు గమనిస్తుంటారన్నారు.

సభలు,సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయో, ఎవరేం పని చేస్తున్నారో,ఏం మాట్లాడుతున్నారో, ఎవరి బలమెంతనో కేసీఆర్, కేటీఆర్ లకు తెలుసని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.వారి ముందు ఎవరి ఆటలు సాగవని, సిఫార్సులు,పైరవీలు నడవని, పార్టీని నమ్ముకుని గులాబీ జెండా మోస్తూ కష్టపడి పని వారిని తప్పకుండా గుర్తించి అవకాశాలు,పదవులు ఇస్తారన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారని, గులాబీ సైనికులపై అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీ రవిచంద్ర విమర్శించారు.ఆరు నెలల తర్వాత ఆయన మాటల్ని,ఆదేశాలను మంత్రులు,అధికారులు కూడా పట్టించుకోరన్నారు.

రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అద్భుతంగా గెల్చి రాష్ట్రంలో అధికారం చేపట్టడం,కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎంపీ రవిచంద్ర ధీమాగా చెప్పారు.అప్పుడు పార్టీ కోసం అంకితభావంతో పని చేసిన వారికి పదవులు రావడం, రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందడం జరుగుతుందని వివరించారు.ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా 18 నిండిన వారందరి ఓట్లను నమోదు చేయించాలని,

ఉన్న ఓట్లు గల్లంతు కాకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని గులాబీ శ్రేణులకు ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు గుండాల కృష్ణ (ఆర్జేసీ),బొమ్మెర రాంమూర్తి, గిరిబాబు,కృష్ణార్జున్,మనీషా లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా "జై తెలంగాణ జైజై తెలంగాణ","వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి","జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్","రేవంత్ రెడ్డి పోవాలి-కేసీఆర్ రావాలి"అనే నినాదాలు మిన్నంటాయి.