22 June, 2026 | 6:59 PM

సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా

22-06-2026 05:50 PM

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సింగరేణి సంస్థ ఒప్పందం

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇన్సూరెన్స్ పథకానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో, సోమవారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో శాలరీ ఎకౌంటు కలిగి ఉన్న సింగరేణి ఉద్యోగులకు, కోటి నుండి కోటి యాబై లక్షల వరకు ప్రమాద బీమా సొమ్మును చెల్లించడం జరుగుతుంది. సింగరేణి యజమాన్యం ప్రత్యేక చొరవతో సహజ మరణానికి కూడా 10 లక్షల నుండి 20 లక్షల వరకు భీమా సదుపాయం కల్పించారు. 

సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎం‌డి డాక్టర్  బుద్దప్రకాష్ జ్యోతి, ఐ‌ఏ‌ఎస్  ఆదేశాల మేరకు,  డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్  గౌతమ్ పోట్రు, ఐ‌ఏ‌ఎస్, ప్రత్యేక చొరవ ఫలితంగా  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ఈ కొత్త ఒప్పందం జరిగినది.  అంతేకాకుండా శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు మరికొన్ని మంచి రాయితీలను ఈ ఒప్పందంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ & సి‌ఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ,సింగరేణి సంస్థలో పని చేసే ఉద్యోగులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు కలిగిఉండి, తమ ఖాతాలను శాలరీ ఎకౌంటుగా మార్చుకున్న వారికి ప్రమాద బీమా పథకంతో పాటు మరికొన్ని మంచి రాయితీలు అమల్లోకి వస్తాయన్నారు.

ఉద్యోగులందరూ చిరకాలం ఆయురారోగ్యాలతో తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సుఖసంతోషాలతో ఉండాలి అనేదే కంపెనీ ఉద్దేశమని, అనుకోని ఘటనలు జరిగినప్పుడు  కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలవడం కోసం, ఇటువంటి బీమా పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం జనరల్ మేనేజర్ (పర్సనల్) వెల్ఫేర్ & సి‌ఎస్‌ఆర్ శ్రీ జి.వి.కిరణ్ కుమార్, మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైద్రాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ ఏ.వి.రమణ మూర్తి, ఈ ఒప్పోంద పత్రాలపై సంతకాలు చేశారు.