22 June, 2026 | 6:59 PM

డ్రగ్స్ కు వ్యతిరేక విద్యార్థులకు అవగాహన

22-06-2026 05:37 PM

* మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సీఐ నరేష్

ఇచ్చోడ: యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ నరేష్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వ్యక్తులు ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలాగే, డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగంపై ఎలాంటి అనుమానాస్పద సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, యువత తమ స్నేహితులను కూడా ఈ వ్యసనాల బారిన పడకుండా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.

పాఠశాల ప్రిన్సిపాల్ కె. ప్రవీణ్ మాట్లాడుతూ... విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, చట్టాల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సీఐ నరేష్ అందించిన సూచనలు, డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.