అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు
నిర్మల్,(విజయక్రాంతి): అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సోమవారం జిల్లా కలెక్టర్, కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ఎంపీడీవో లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడిసెల్లో నివసించే అర్హులైన పేదలందరికీ రెండో దశలో ఇందిరమ్మ ఇండ్లను అందివ్వాలని తెలిపారు.
రెండో దశలో మంజూరైన ఇండ్లు, దరఖాస్తుల పరిశీలన, అనుమతించిన ఇండ్లు, ఎంపీడీవో లాగిన్ ల నుండి కలెక్టర్ లాగిన్లకు పంపిన ఇండ్లు, తదితర వివరాలను మండలాల వారిగా ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాలన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. అనుమతుల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. రోజు వారీగా సంబంధిత రిపోర్టులన్నీ తమకు అందజేస్తూ ఉండాలని వివరించారు. ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, హౌసింగ్ పిడి శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






