26-05-2025 08:21:40 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కాజీపేట విజయవాడ సెక్షన్ లో మహబూబాబాద్ రైల్వే స్టేషన్(Mahabubabad Railway Station) వద్ద ఎన్ఐ, మూడో లైన్ పనుల నేపథ్యంలో వివిధ రైళ్లను దారి మళ్లింపు, మరికొన్ని రైళ్లకు ప్రత్యామ్నాయంగా కేసముద్రంలో హాల్టింగ్ కల్పించడంతో మహబూబాబాద్ ప్రాంత రైల్వే ప్రయాణికుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. కాజీపేట విజయవాడ వైపు వెళ్లే రైళ్లను మహబూబాబాద్ లో నిలుపుతుండగా, విజయవాడ కాజీపేట మార్గంలో వెళ్లే రైళ్లను మహబూబాబాద్ లో నిలపకుండా కేసముద్రంలో నిలుపుతున్నారు.
అయితే చాలా మందికి ఏ వైపు రైళ్లు అగుతున్నాయో.. ఏ మార్గంలో ఆగడం లేదో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. కొన్ని రైళ్లను మహబూబాబాద్ స్టేషన్కు కాస్త దూరంలో నిలుపుతుండడంతో ప్రయాణికులు అందులో నుంచి దిగి కాలినడకన మహబూబాబాద్ చేరుకుంటున్నారు. రైలు దిగలేని పరిస్థితిలో ఉన్నవారు కేసముద్రంలో దిగి ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాల్లో తిరిగి మహబూబాబాద్ చేరుకుంటున్నారు. రైళ్ల నిలుపుదల అంశం పూర్తిగా ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తుందని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.