22-07-2025 08:40:18 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీవారి సర్వదర్శనానికి ఏటీజీహెచ్ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. 77,481 మంది భక్తులు నిన్న తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. 30,612 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.96 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD officials) అధికారులు ప్రకటించారు. మైసూర్ మహారాజు జయంతి సందర్భంగా తిరుమలలో సాంప్రదాయ పల్లవోత్సవం నిర్వహించారు. సహస్ర దీపాలంకార సేవ తర్వాత, శ్రీ మలయప్ప స్వామిని ధర్మపత్నులతో కర్ణాటక చౌల్ట్రీకి తీసుకెళ్లారు. అక్కడ పూజలు, ప్రత్యేక హారతి నిర్వహించారు.
అక్టోబర్ నెలకు సంబంధించి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను టీటీడీ నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు(Srivari Arjitha Seva tickets) సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ పొందిన వారు రేపు మధ్యాహ్నం 12 గంటలకు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరు కానున్నాయి. తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం(TTD Board Members Meeting) కొనసాగనుంది. ఈ భేటీలో 45 అంశాలపై పాలకమండలి చర్చించనుంది. వైకుంఠ క్య కాంప్లెక్స్ 3 నిర్మాణాల ప్రతిపాదనలపై పాలకమండలి చర్చించనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఒంటిమిట్ట రామాలయంలో నిత్య అన్నదానం ప్రారంభించనున్నారు.