కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
సంస్థాన్ నారాయణపూర్, జూలై 23: సంస్థాన్ నారాయణపురం మండలకేంద్రంలో కాంగ్రెస్ - బీజేపీ పార్టీల పోటాపోటీ నిరసనలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థులకు అండగా నిలిచిన రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుల పట్ల కేంద్రం వ్యవహరించిన తీరును నిరసిస్తూ మండల కేంద్రంలోని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టి నినాదాలు చేశారు.
మరోవైపు బీజేపీ నాయకులు కూడా చౌరస్తకు చేరుకొని కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మను దగ్దం చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరుపార్టీల నాయకుల నినాదాలతో ఆప్రాంతం హోరెత్తిపోయింది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతోందని శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ ఛార్జీ చేయడం దుర్మార్గమని అన్నారు.
దీనిపై విద్యార్థులకు అండగా నిలబడ్డ రాహుల్ గాంధీని కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టిన నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాంగ్రెస్ నాయకుల లక్ష్యమని అన్నారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకొని విద్యార్థులు తమ విద్యాసంవత్సరం నష్ట పోకుండా వారికి వెంటనే పరీక్షలు నిర్వహించారని అన్నారు.
విద్యార్థులపై కాంగ్రెస్ కపట ప్రేమను దేశమంతా గమనిస్తోందని అన్నారు.మరోవైపు నిరసనలతో బస్సులు అరగంట పాటు ఆపివేయడంతో కొందరు మహిళలు అసహనం వ్యక్తం చేశారు. సిఐ సతీష్ రెడ్డి,ఎస్సై పాండు ఇరుపార్టీల నాయకులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కరంటోతు శ్రీను,కత్తుల లక్ష్మయ్య,జైపాల్ రెడ్డి,బుజ్జి నాయక్,వివిధ గ్రామాల సర్పంచులు,బీజేపీ నాయకులు డోనూరి వీరారెడ్డి, సూర్వి రాజు, జక్కలి రాజు,బండమీది కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






