13 August, 2026 | 5:14 AM

హత్యా రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్

13-08-2026 01:25 AM
  1. వెంకటేశం హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి
  2. అసలు సూత్రధారులను బయటపెట్టాలి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్

సిరిసిల్ల, ఆగస్ట్ 12, (విజయ క్రాంతి): నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య వెనుక అసలు కారణాలు, సూత్రధారులను వెలుగులోకి తీసుకురావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం బీవైనగర్లోని వెంకటేశం కుటుంబాన్ని ఆయన పరామర్శించి, భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు.

రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఎదుర్కోవాలని, సామాన్యులను రాజకీయాలకు బలిపశువులను చేయడం సరికాదన్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెబుతున్నా.. ఇద్దరినే రిమాండ్కు పంపి, ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై ప్రశ్నించారు. అరెస్టయిన వారు కేవలం పాత్రధారులా, అసలు సూత్రధారులు ఎవరో తేల్చాలని కోరారు.

ఇల్లు నిర్మించి ఇస్తాం 

వెంకటేశం కుటుంబం ఉంటున్న ఇల్లు ఇబ్బందికరంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయకపోతే బీఆర్‌ఎస్ తరఫున నిర్మించి ఇస్తామని చెప్పారు. ఈ విషయంపై కలెక్టర్తో మాట్లాడినట్లు వెల్లడించారు.

కుమార్తె చదువు బాధ్యత నాదే 

వెంకటేశం కుమార్తె పేరుపై రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్లు కేటీఆర్ తెలిపారు. పదో తరగతి వరకు ఆమె చదువు ఖర్చులను తానే భరిస్తానని, ఆ తర్వాత ఉన్నత విద్య బాధ్యత కూడా తీసుకుంటానని హామీ ఇచ్చారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు.

వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలపైనా దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టాలని పోలీసులను కోరారు. రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెట్టాలని కేటీఆర్ స్పష్టం చేశారు.