calender_icon.png 6 December, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు గ్యారంటీలలో కాంగ్రెస్ విఫలం

06-12-2025 01:18:38 PM

  1. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ 
  2. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్

హన్మకొండ/వరంగల్,(విజయక్రాంతి): పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుడికాల శ్రీధర్ కి మద్దతుగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్  శనివారం గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడుతూ అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ విమర్శించారు.రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు.

రైతు భరోసా, చేయూత, యువ వికాసం, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల పేరిట ప్రకటించిన ఆరు గ్యారంటీలలోని అనేక హామీలను గాలికి వదిలేశారన్నారు. ముఖ్యంగా, రూ.2 లక్షల పంట రుణమాఫీని కేవలం మొక్కుబడిగా పూర్తి చేసి చేతులు దులుపుకున్నారని, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.12 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, ప్రతి మండలానికో అంతర్జాతీయ స్థాయి పాఠశాల వంటి హామీలేవీ అమలుకు నోచుకోలేదన్నారు. నిరుద్యోగ భృతి, పంటలకు రూ.500 బోనస్ ఊసే లేదని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ కి ఓటుతో బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు.

బీజేపీ కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని,రాష్ట్ర ప్రభుత్వం నిధులను సక్రమంగా వినియోగించడం లేదని ప్రజలకు వివరించి బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుడికాల శ్రీధర్, వార్డు మెంబర్లను  అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్, మండల అధ్యక్షులు భిక్షపతి యాదవ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు  బత్తిని దేవేందర్, రమాదేవి, బొల్లం రాకేష్, వేణు, పంజా వీరస్వామి, మండల నాయకులు పిచ్చిరెడ్డి, సాంబయ్య మరియు పెద్దఎత్తున మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.