calender_icon.png 6 December, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పోలీస్ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం

06-12-2025 01:20:56 PM

పోలీస్ హెడ్ క్వాటర్స్ లో మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ నితికా పంత్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): పోలీస్ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితికా పంత్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి, ఎఎస్పి చిత్తరంజన్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ వ్యవస్థలో హోంగార్డులు కీలకమైన భాగస్వాములు, శాంతిభద్రతల పరిరక్షణలో వారు పోషిస్తున్న పాత్ర అనన్యసమానమని తెలిపారు.

ప్రజల భద్రత, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, నేర నియంత్రణ, పోలీస్‌ బలగాలకు అవసరమైన సహకారం అందించడంలో హోంగార్డులు చూపుతున్న క్రమశిక్షణ, విధేయత, నిబద్ధత పట్ల ప్రశంసలు కురిపించారు.హోంగార్డులు ఎల్లప్పుడూ ముందుండి విధులను నిర్వర్తించడం, పండుగలు, ఎన్నికలు, విశేష కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ప్రజాసేవలో తమ వంతు పాత్రను నిర్వర్తించడం జిల్లా పోలీస్ శాఖకు ఎంతో బలాన్ని అందిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.

సమాజ శాంతి భద్రతలు కాపాడాలంటే ప్రతి హోంగార్డ్ చూపుతున్న అంకితభావం పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. హోంగార్డుల యొక్క సంక్షేమం గురించి పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విధుల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన హోంగార్డులను గుర్తింపుగా  ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎఎస్పీ చిత్తరంజన్, ఆర్.ఐ హోమ్ గార్డ్స్ విద్యాసాగర్, ఆర్.ఐ అడ్మిన్ వామనమూర్తి, ఆర్.ఐ (ఎం.టి.ఓ) అంజన్న,  హోంగార్డు సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.