09-11-2025 12:41:52 AM
తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ
ముషీరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోలేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ ఆటో కార్మికులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ ప్రతినిధులు అమానుల్లా ఖాన్, వేముల మారయ్య లు మాట్లా డుతూ కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు12 వేలు ఇస్తామని ప్రకటించారని, అదేవిధంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, హామీ ఇచ్చారని, కానీ నేటి వరకు హామీలు నెరవేర్చలేదని వారు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కరువై రాష్ట్రంలో దాదాపు 163 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆరోపించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదు లక్షల ప్రమాద బీమా ఆటో కార్మికులకు ఇస్తామని ప్రకటించిందని, రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ఆపేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధు లు పాండు నాయక్, మహబూబ్ బాషా, సిహెచ్. వెంకన్న, బాలు నాయక్, ఎస్కే. సత్తార్మియా, పాషా, రామకృష్ణ, రామాంజనే యులు, శ్రీనివాసులు యాదవ్, శ్రీరామ్, ప్రశాంత్, మురళి తదితరులు పాల్గొన్నారు.