09-11-2025 12:42:53 AM
హైదరాబాద్, సిటీబ్యూరో నవంబర్ 8(విజయక్రాంతి): ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ (ఐఎంసీ) గా మార్చేశారు.. ఇక తెలంగాణను కూడా ఇస్లామిక్ స్టేట్‌గా మార్చే కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే పార్కులు ఖబరస్తాన్లు, ఈద్గాలు, మసీదులుగా మారుతాయని హెచ్చరించారు.
రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడుల వెనుక ముస్లింలే ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. శనివారం షేక్ పేటలోని శివాజీ విగ్రహం వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నిక సాధారణ రాజకీయ పోరు కాదని, ఇది హిందువులు -ముస్లింల మధ్య, ధర్మానికి -అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని ఆయన అభివర్ణించారు.
హిందువులంతా బీజేపీ ఓటు బ్యాంకుగా మారి ఆదరించాలని పిలుపునిచ్చారు. హిందువుల పక్షాన బీజేపీ ఉంటే, ముస్లింల పక్షాన కాంగ్రెస్ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని చెబుతున్నాడు. ఆయనకు 3 లక్షల హిందువుల ఓట్లు అవసరం లేదట, లక్ష ముస్లింల ఓట్లే కావాలట,అని తీవ్రంగా విమర్శించారు.
కేటీఆర్‌కు కౌంటర్...
బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే బండి సంజయ్ సంగతి చూస్తానని కేటీఆర్ వాగుతున్నడు. మీ అయ్య కేసీఆరే ఏమీ చేయలేకపోయాడు.. నువ్వు నన్నేమీ చేయలేవని ఘాటుగా బదులిచ్చారు. ‘నాపై 109 కేసులు పెట్టినప్పుడే భయపడలేదు, నా కొడుకుపైనా కేసు పెట్టి వేధించారు, నా భార్యను ఇబ్బంది పెట్టారు.. నేను మీ లెక్క ఓట్ల కోసం టోపీ పెట్టుకుని అడుక్కునే బిచ్చపు బతుకు నాది కాదు’ అని వ్యాఖ్యానించారు.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని బీఆర్‌ఎస్ నేతలు వేధిస్తున్నారని, ఆయన ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీని గెలిపిస్తే బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడి కట్టిస్తానని, దానికి అమిత్ షాను పిలిపించి కొబ్బరికాయ కొట్టిస్తానని హామీ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు కూడా సనాతన ధర్మం కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.