calender_icon.png 9 October, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాస్ పథకం పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

08-10-2025 10:30:05 PM

పట్టణ ప్రధాన కార్యదర్శి కుచులకంటి శంకర్

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాస్ పథకం పేరుతో తెలంగాణ రాష్ట్ర యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్లు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి కుచులకంటి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని నెలల క్రితం హడావిడిగా ప్రారంభించిన ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల ఎంపిడిఓ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి వేలాది మంది యువతను ఆశలతో ఉంచినా, ఇప్పటికీ లబ్ధిదారుల పేర్లను ప్రకటించకపోవడం, నిధులను విడుదల చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం పథకం ప్రకటించి, ఆ తరువాత యువతను వంచించడం ప్రజాస్వామ్యానికి అవమానం అని కుచులకంటి శంకర్ వ్యాఖ్యానించారు. పేద కుటుంబాల యువత స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల తీవ్ర నిరాశ వ్యాప్తి చెందిందన్నారు.

నిజంగానే యువత భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉంటే, వెంటనే రాజీవ్ యువ వికాస్ లబ్ధిదారుల పేర్లను ప్రకటించి రుణాలను నిధులను విడుదల చేయాలి. లేకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో యువత తమ ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుగా మౌనం వహించడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని, ఇది యువతను బోల్తా కొట్టించడం తప్ప మరేదీ కాదని ఆయన ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఇది రాజీవ్ యువ వికాస్ పథకమా? లేక యువతను వంచించే పథకమా? అంటూ ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేయాలని ఎల్లారెడ్డి పట్టణ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కుచులకంటి శంకర్ డిమాండ్ చేశారు.