18 June, 2026 | 10:37 PM

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతుంది

05-08-2025 09:23 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో యూరియా కొరత పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో రాష్ట్రానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు తెలిపారు.

రైతు బంధు ఎంతమంది రైతులకు ఇచ్చారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పగలరా? అని విమర్శించారు. రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు రైతాంగం నడ్డి విరిచే పనులు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన తెలంగాణలోని ప్రతి రైతు కుటుంబానికి చేరిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లి హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిందని ఏద్దేవా చేశారు.

అంతకుముందు పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ రుణమాఫీ చేయకపోవడం వలననే రైతుల ఆత్మహత్యలు పెరిగినట్లు వివరించారు. రైతులు ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. అంతేకాకుండా కౌలు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపుతోందన్నారు.