1 September, 2026 | 12:38 AM

హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కారు

01-09-2026 12:00 AM

ప్రభుత్వంపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం

బడంగ్‌పేట్, ఆగస్టు 31: (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వేయి రోజులు పూర్తవుతున్నా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. జిహెచ్‌ఎంసి బడంగ్ పేట్ సర్కిల్ మీర్ పేట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎన్నికల వేళ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వాటి అమలును పూర్తిగా విస్మరించిందన్నారు. సమస్యలు తీర్చాల్సింది పోయి కేవలం సభలు, సమావేశాలు, పబ్లిసిటీకే పరిమితం అయ్యారని విమర్శించారు. రైతు బీమా సహా రైతాంగ సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని, దీనిపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులకు ఇచ్చిన మాటపై పునఃసమీక్ష జరపాలని కోరారు.

ఇప్పటి వరకు ఎన్ని హామీలు నెరవేర్చారు, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయో ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించామని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కాలయాపన చేయడం సరికాదని, హామీలు పూర్తయ్యేంత వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.