15-07-2025 12:00:00 AM
గజ్వేల్, జులై14: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో పంటల సాగు గణనీయంగా తగ్గి వ్యవసాయం సంక్షోభం దిశగా పోతుందని గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుండి వ్యవసాయ రంగం తిరోగమనం ప్రారంభం అయిందన్నారు. కెసిఆర్ హయాంలో రైతాంగానికి సకాలంలో రైతులకు 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుభీమా, సాగునీళ్లు,మేలైన విత్తనాలు, ఎరువులు అందా యన్నారు.
అంతేకాకుండా పండించిన ప్రతీ గింజను కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు ముంగిట్లో ప్రభుత్వం ద్వారా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిన చరిత్ర కెసిఆర్ దేనన్నారు. కెసిఆర్ రైతు మొగులు ముఖం కాకుండా కాలువలో నీళ్లను చూసి పంట వేసుకోవాలనే ముందు చూపుతో సాగునీటి ప్రాజెక్టులను అనతి కాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీళ్లు అందించాలని సంకల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో లక్షలాది ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను క్షోభకు గురిచేస్తుందన్నారు.
అటు గోదావరి, ఇటు కృష్ణా నదిలో ఎగువ రాష్ట్రాల్లో వానల వల్ల మంచి వరద వస్తున్నా నీళ్లను ఎత్తిపోయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే గోదావరి నదిలో మోటార్లు ఆన్ చేసి పైన ఉన్న రిజర్వాయర్లన్నీ నింపి రైతాంగానికి సాగునీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన ప్రాధా న్యతలను మార్చుకొని వ్యవసాయాన్ని నిలబెట్టే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో రైతాంగం నుండి ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ నాయకులు రమేష్ గౌడ్, శివకుమార్, ఉమర్, నిజాం తదితరులు పాల్గొన్నారు.