calender_icon.png 15 July, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణ జలాలను సమృద్ధిగా వినియోగిస్తాం

15-07-2025 12:00:00 AM

  1. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  2. పాలేరు రిజర్వాయర్ నుంచి సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీటి విడుదల 
  3.    2.53 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి పొంగులేటి

ఖమ్మం, జూలై 14 (విజయక్రాంతి): కృష్ణా నది నీటిని తెలం గాణ రాష్ట్రం సమృద్ధిగా వినియోగించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సోమవారం కూసుమంచి మండలం పాలేరు వద్ద పాలేరు రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ లెఫ్ట్ లాల్ బహదూర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు ఖరీఫ్ సాగుకు సాగు నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం, విద్యుత్, బహుళ సార్థక ప్రాజెక్టులకు ప్రజా ప్రభుత్వం చర్య లు తీసుకుందని అన్నారు. గతంలో బీఆర్‌ఎస్ హయంలో చేసిన అసంబద్ద చర్యల కారణంగా నష్టం వాటిల్లిందని చెప్పారు. కృష్ణ, గోదావరి నదులలో తెలంగాణ వాటా సాధన, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టు జోన్ 1, 2 ప్రాంతాలు ఇబ్బందులకు గురవుతాయని గతంలో చెప్పినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి రోజుకు 11 టిఎంసీల నీరు తరలించేందుకు నిలువ ప్రాజెక్టుల నిర్మాణానికి గత ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు. 

2.53 లక్షల ఎకరాలకు సాగర్ నీళ్లు: పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలేరు రిజర్వాయర్ కింద ఉన్న 2 లక్షల 53 వేల ఎకరాల నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేశామని అన్నారు. ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని, క్రమపద్ధతిలో 5 రోజులలో పూర్తి సామర్థ్యంతో నీటి విడుదల చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్‌ఇ ఎం వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ యాకుబ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్ పాల్గొన్నారు.