18-07-2025 12:07:32 AM
భీమారం: భీమారం మండలంలో చేపడుతున్న అభివృద్ది పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. గురువారం మండల కేంద్రంలో నిర్మితమవుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ తో కలిసి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం మెనూ, విద్యాబోధన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల, వసతిగృహాలను సందర్శించి భోజనశాల, ఎనిమిదవ తరగతి గదులను సందర్శించి మరమ్మత్తులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి సమర్పించాలని సంబంధిత అధికారులను కోరారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ఆహారం తయారీ సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులు వినియోగించాలని, వంట చేసే వారు శుభ్రత నిబంధనలు పాటించాలని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖ అధికారులున్నారు.