1 June, 2026 | 12:35 AM

ఆడపడుచుల సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

01-06-2026 12:00 AM

ప్రతి మహిళ కోటీశ్వరురాలిగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మేఘా రెడ్డి, డీసీసీ చీఫ్ శివసేన రెడ్డి

పెబ్బేరు, మే 31 :   తెలంగాణ సాంస్కృతిక  సాంప్రదాయానికి కట్టు,బొట్టుకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలంగాణ మహిళకు ప్రభుత్వం కానుక ఇచ్చే చీర ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎమ్మెల్యే మేఘా రెడ్డి, డీసీసీ చీఫ్ శివసేన రెడ్డి అన్నారు.ఆదివారం పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సహారా ఫంక్షన్స్ హాల్లో నిర్వహించిన మహిళా వారోత్సవాల కార్యక్రమనికి వారు హాజరై, జ్యోతి ప్రజ్వలను వెలిగిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి, సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, మెప్మా అధికారులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.