ప్రచార జోరు పెంచిన కాంగ్రెస్
రంగంలోకి ఢిల్లీ పెద్దలు
నేడు నకిరేకల్ జన జాతర సభకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే
పటాన్‌చెరు, మక్తల్, షాద్‌నగర్‌లో సీఎం రేవంత్ రోడ్ షో
ఎల్లుండి కామారెడ్డి, తాండూరు సభలకు ప్రియాంక గాంధీ
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ప్రచా రానికి ఇక కొద్దిగంటలే మిగిలి ఉం ది. అభ్యర్థుల విజయం కోసం ఆ యా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనీసం 14 సీట్లలో విజయం సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఢిల్లీ పెద్దలు కూడా ప్రచార పర్వంలోకి దిగారు. ఇప్పటికే ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తుండగా, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
బీజేపీ నుంచి గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా ఫోకస్ పెట్టా రు. గురువారం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి మెదక్ పరిధిలోని నర్సాపూర్, మల్కాజిగిరి పరిధిలోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన సభలకు హాజరయ్యారు. గతం లో మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ నే.. ఇందిర హయాంలోనే హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయని, దీంతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని రాహుల్ ప్రసంగిస్తున్నారు. రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
ఇక ఏఐసీసీ అధ్యక్షు డు ఖర్గే కూడా శుక్రవారం ఒకరోజు ఎన్నికల ప్రచారానికి రానున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నకిరేకల్‌లో ఏర్పాటుచేసే సభకు హాజరుకానున్నారు. రేవంత్‌రెడ్డి కూడా శుక్రవారం ౩ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. మెదక్ పరిధిలోని పటాన్‌చెరు, మహబూబ్‌నగర్ లోని మక్తల్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో హాజరుకానున్నారు.
కామారెడ్డి, తాండూరు సభలకు ప్రియాంక గాంధీ..
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 11న రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు కామారెడ్డి, మధ్యాహ్నం ఒంటి గంటకు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని తాండూరులో నిర్వహించే సభ ల్లో పాల్గొననున్నారు.






