24 July, 2026 | 3:17 AM

కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్య?

24-07-2026 12:34 AM
  1. మానకొండూరు ఎమ్మెల్యే పీఏ బెదిరింపులు!
  2. అక్రమ కేసు పెట్టిన సొంత పార్టీ నాయకులు
  3. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
  4. చికిత్సపొందుతూ మృతిచెందిన గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త రాజేందర్‌రెడ్డి 
  5. న్యాయం చేయాలని బంధువుల ఆందోళన

మనకొండూర్, జూలై 23 (విజయక్రాంతి) : ఎమ్మెల్యే పీఏ బెదిరింపులతో పాటు సొంత పార్టీ నాయకులే తనపై అక్రమ కేసు బనాయించారని ఆవేదనతో మనస్థాపం చెంది, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ గన్నేరువరం మండల కాంగ్రెస్ నాయకుడు, గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతల్లి సమత భర్త రాజేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నెల 14న ఎల్‌ఎండీలోని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని రాజేందర్‌రెడ్డి నిప్పంటించుకు న్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి కన్నుమూశాడు.

దీంతో గురువారం కరీంనగర్‌లోని ఆసుపత్రి వద్ద బంధువులు నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ పోలీస్ అధికారులు అక్కడ చేరుకొని రాజేందర్ రెడ్డి భార్య సమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సమత ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పర్సనల్ అసిస్టెంట్ వంగల మురళీధర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ సాదిక్, వంగల రవీందర్‌రెడ్డి, పైడిమల్ల మల్లేశం, బొగ్గుల శ్రవణ్‌లపై నాన్ బెయిలేబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజేందర్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గుండ్లపల్లికి భారీ భద్రత ఏర్పాట్ల మధ్య తరలించారు.

గుండ్లపల్లి స్టేజి వద్ద మృతుని భార్య, బంధువులు, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. బాధిత కుటుంబానికి అండగా బీఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, గ్రామ ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని సమత హెచ్చరించారు.