24 July, 2026 | 3:23 AM

జగ్గారెడ్డి -నిర్మల ఆధ్వర్యంలో.. సంగారెడ్డిలో వేయి మందితో మహా పాదయాత్ర

24-07-2026 12:32 AM

సంగారెడ్డి, జూలై 23: నీట్ పేపర్ లీకేజీ ఘటన బాధితులపై చర్యలు తీసుకోవాలంటూ... రాహుల్ గాంధీ చేసిన నిరసనలకు మద్దతుగా సంగారెడ్డిలో మూడో రోజు ఆందోళనలు కొనసాగాయి. ప్రజల పక్షాన నిలుస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ఆటవికపు చర్య అంటూ సంగారెడ్డిలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ నేతలను నిర్బంధించి.. పార్లమెంటులో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.

నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో పాటు. రాహుల్ గాంధీకి మద్దతుగా పాదయాత్ర చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బ్లాక్ టీ షర్ట్లు ధరించి సుమారు వేయి మంది ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ నుండి మొదలుకుని గంజి మైదాన్ వరకు 5 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. ప్లకార్డులు ప్రదర్శన, నినాదాలతో కార్యకర్తలు నిరసనను హోరెత్తించారు.