17-08-2025 08:13:12 PM
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే కనీస అర్హత లేదనీ 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేగా, నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రజలకు చేసింది ఏమీ లేదనీ నారాయణపురం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కరెంటోతు శ్రీను నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల వచ్చిన అభివృద్ధి నిధులను తాను తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క శాఖకు ప్రత్యేకంగా ఒక మనిషిని కేటాయించి మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే యజ్ఞాన్ని రాజగోపాల్ రెడ్డి చేపట్టారనీ అన్నారు.
మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి రాజగోపాల్ రెడ్డి అనుసరిస్తున్న ఆలోచనలే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందనీ రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాళ్ల దెబ్బలు తింటావని హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే కాలుష్య కారక పరిశ్రమల దగ్గర నుండి బెదిరించి ఎన్ని డబ్బులు తీసుకున్నావో అందరికీ తెలుసని, హాస్టల్ వార్డెన్ గా పని చేస్తూ విద్యార్థులు తినే నోటికాడి కూడులో కమిషన్లు దండుకున్న నువ్వెక్కడ ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి విద్యార్థులకు వేల రూపాయల నగదు బహుమతులు అందించే రాజగోపాల్ రెడ్డి ఎక్కడ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు.