07-01-2026 12:54:49 AM
కేసీఆర్‌ను కాదు.. రాహుల్‌ను ఉరితీయాలి
రైతులను మోసగించినందుకు శిక్ష
మహబూబాబాద్/జనగామ, జనవరి 6 (విజయక్రాంతి): 70 లక్షల మంది రైతులను మాయమాటలతో మోసగించి, హౌలాగాడిని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని ఉరితీయాలని, ప్యాకేజీ మాట్లాడుకుని ముఖ్యమంత్రి పదవి పొందిన రేవంత్‌రెడ్డి లాగులో తొండలు ఎక్కించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. జనగామ జిల్లాలో గెలిచిన బీఆర్‌ఎస్ సర్పంచులను మంగళవారం జనగామ కేంద్రంలో కేటీఆర్ సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఉరితీయాలన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 60 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతాన్ని ఇష్టంలేని పెళ్లి చేసిన విధంగా ఆంధ్రాలో కలిపి, తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమించిన వారిని కాల్చి చంపిన కాంగ్రెస్ చేసిన దురాగతాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదన్నారు. తెలంగాణకు జరుగుతున్న నష్టా న్ని గుర్తించిన కేసీఆర్ 14 ఏళ్లు ఉద్యమించి చివరకు చావు నోట్లో తలపెట్టి సాధించినందుకు ఉరితీయాలా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రం సాధించిన తర్వాత 10 ఏళ్లపాటు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంతో పాటు వ్యవసాయ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసి నందుకు ఉరితీయాలా అంటూ ప్రశ్నించారు. 73 వేల కోట్ల రూపాయలను 75 లక్షల మంది రైతులకు ప్రతి సీజన్‌లో రైతు భరోసా ఇచ్చినందుకు ఉరితీయాలా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో 15 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చినందుకు ఉరితీయాలా అంటూ ప్రశ్నించారు.
రెండుసార్లు రుణమాఫీ చేయడంతో పాటు వ్యవసాయ రంగంలో అత్యధిక దిగుబడి సాధించి భారత దేశంలో పంజాబ్, హర్యానాను పక్కనపెట్టి తెలంగాణను అగ్రస్థానంలో నిలిపినందుకు కేసీఆర్‌ను ఉరితీయాలా అంటూ ప్రశ్నించారు. వరంగల్‌లో నిర్వహించిన రైతు సభలో లీడర్ కానీ లీడర్, స్క్రిప్ట్ చదివిన రాహుల్ గాంధీతో రైతులకు అండగా ఉంటామని, రైతులందరికీ రైతు భరోసా, కౌలు రైతులకు రూ.12 వేలు, కూలీలకు నెలకు వెయ్యి ఇస్తామని చెప్పి, ఇప్పటికీ రెండు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన రాహుల్‌గాంధీని ముందు ఉరితీయాలన్నారు. 420 హామీలతో ప్రజలను, రెండు లక్షల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలను ఉరితీయాలన్నారు.
ఢిల్లీకి రేవంత్‌రెడ్డి 6 వేల కోట్ల ప్యాకేజీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అ ఆ లు ఇ ఈలు కూడా సరిగా రావని, ఢిల్లీకి నెలకు 100 కోట్ల పేమెంట్ ఇస్తామని రూ.6 వేల కోట్ల ప్యాకేజీతో సీఎం సీటు దక్కించుకున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఆయన లాగులో తొండలు ఎక్కించడం ఖాయమన్నారు. కాళోజీ చెప్పినట్లుగా కాలం వచ్చేదాకా నిరీక్షించి కసితీరా కాటేయాలని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చేయడానికి కసిగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, కనీసం అటు వైపు చూడని వారికి కూడా బీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చి ఎంపీ ఎమ్మెల్యేలను చేస్తే అవకాశవాదులుగా మారి పార్టీ ఫిరాయించారని విమర్శించారు.
రాష్ట్రంలో రాబందు రాజ్యం, గుండా రాజ్యం సాగుతోందని, ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, అయినా జనగామ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన 150 మంది సర్పంచులు గెలుపొందడం, ప్రజలు బీఆర్‌ఎస్ వైపు ఉన్నారని ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఏం తెల్వదు.. మూటలు మోసుడు తప్ప ఏం తెల్వదని, గోదావరి ఎక్కడుందో తెలియని హౌలే గాడు రేవంత్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాబందు కాలం తెచ్చిన రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిపోయిందని, ఎలా ప్రజలను మోసం చేశారో ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. యూరియా కోసం రైతులు చలిలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎనకటి రోజులు తెస్తామన్న రేవంత్‌రెడ్డి.. అదే తీరుగా రాబందు కాలం తెచ్చాడని విమర్శించారు. గ్రామాల్లో రేవంత్‌రెడ్డిని నోటికొచ్చినట్లు తిడుతున్నారని, తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచిరంపాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోయి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే ముఖం లేని రేవంత్‌రెడ్డి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వలేని రేవంత్‌రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు ఎలా చేస్తాడని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు పుస్తెలతాడు తాకట్టు పెట్టి బతికే పరిస్థితి దాపురించిందన్నారు. రేవంత్‌రెడ్డి తన సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రజల ముందే అడ్డగోలుగా కొడుతున్నాడని, త్వరలో కరుస్తాడు కాబట్టి కట్టివేయమని రేవంత్‌రెడ్డి భార్య గీతకు చెప్పామని పేర్కొన్నారు.
నా చదువు మీద ఎందుకు ఏడుపు?
రేవంత్‌రెడ్డి నా చదువు మీద ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డిని తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే లంగా పనులు చేసుకుంటూ.. పెయింటింగులు వేసుకుంటూ చదువుకోలేదని, దానికి తానేం చేయాలన్నారు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్, అందుకే ఆయన నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటా అన్నారు. అలాంటి మొనగాడిపై సవాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ చెప్పు ధూళికి సరిపోడని విమర్శించారు.
కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్‌కే రేవంత్‌రెడ్డి ఆగమాగం అవుతున్నాడని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసెంబ్లీలోనే గుండె ఆగి చస్తాడంటూ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేకున్నా అన్ని పదవులు ఇచ్చిన పార్టీని వదిలి కడియం రేవంత్‌రెడ్డితో కలిశాడని, తమకు నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉన్నారని కేటీఆర్ చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.