జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం
జొన్న పంటలకు భారీ నష్టం
రైతుల ఆవేదన
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. పలుచోట్ల కోత దశలో ఉన్న పంటలు నేలకొరిగి రైతుల ఆశలు నీరుగారాయి. ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ శివారులో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.స్థానిక రైతు బాబురావుతో పాటు మరో రైతు కలిసి మొత్తం 4 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు.
పంట కోత దశకు చేరుకున్న సమయంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం వారి ఆశలను ఛిద్రము చేసింది. వర్షం తీవ్రతకు జొన్న పంట పూర్తిగా నేలకొరిగి భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులతో అప్పుల బారిన పడ్డ రైతులకు ఈ నష్టం మరింత భారంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అనేక మంది రైతులు నష్టపోయినట్లు తెలుస్తోంది.
వాతావరణ మార్పుల ప్రభావంతో ఇటీవలి కాలంలో అకాల వర్షాలు తరచుగా కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కోత దశలో ఉన్న పంటలకు ఈ వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.




